కలం, నిజామాబాద్ బ్యూరో: కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR)ను పక్కదారి పట్టించిన వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేయడంతో కొందరు మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 14 మందిపై కేసులు నమోదు చేయడం, ఆరుగురిని అరెస్టు చేయడంతో మిగతా మిల్లర్లకు భయం పట్టుకున్నది. సీఐడీ ఏదో ఒకరోజు తమదాకా వస్తుందని, అరెస్ట్ చేస్తుందన్న భయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 30 మంది మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
సీఐడీ ఎంట్రీతో టెన్షన్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 60 మందికి పైగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నది (Nizamabad CMR Scam). దీంతో వీళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయిస్తున్నది. బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ కూడా చేసింది. నిజామాబాద్ జిల్లా డీసీఎస్వో శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేయడం, ఏకంగా సీఐడీ రంగంలోకి దిగడంతో మిల్లర్లకు టెన్షన్ పట్టుకున్నది.
గతంలో లాగా రైస్ మిల్లులపై దాడుల తర్వాత అంతా సైలెంట్ అవుతుందని మిల్లర్లు భావించగా, ఊహించని విధంగా సీఐడీ సడెన్ ఎంట్రీతో ఉలిక్కిపడ్డారు. సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడం, ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు స్టాక్ లేకపోవడంతో సీఐడీ చేతికి చిక్కక తప్పదని భావించి కొందరు మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఖరీఫ్ సీజన్లో నో సీఎంఆర్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో పలువురు రైస్ మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్ల జాబితాలో చేర్చింది. ఈ ఖరీఫ్ సీజన్లో ఆ మిల్లులకు ధాన్యం కేటాయించడానికి నిరాకరించినట్లు తెలుస్తున్నది. దీంతో మిల్లర్లు ఆందోళనలో పడిపోయారు. పలువురు ఆస్తులు అమ్మి బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటు బకాయిలు చెల్లించలేక, అటు కొత్త ధాన్యం రాక మిల్లర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు మిల్లర్లను డిఫాల్టర్ జాబితాలో పెట్టడంతో సీఎంఆర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.300 కోట్లపైనే బకాయిలు
2022-23 నుంచి గత రబీ సీజన్ వరకు మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. 2022-23కు సంబంధించి 6,35,190 టన్నుల ధాన్యం జిల్లాలోని 244 రైస్ మిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు మిల్లర్లు ప్రభుత్వానికి 2,58,643 టన్నులు మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇంకా లక్షా 50వేలకు పైగా టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉన్నది. 2024-25కు సంబంధించి 8.40 లక్షల టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లకు కేటాయించారు.
ఇందులో 5.72 లక్షల టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, ఇంకా 13 వేల టన్నుల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తున్నది. 2025 రబీ సీజన్‌కు సంబంధించి 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉన్నది. గత నాలుగేళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు భారీగా అవినీతికి పాల్పడ్డారు. రూ.300 కోట్లకు పైనే సీఎంఆర్ బకాయిలు ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది.

