కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంపై మహబూబ్ నగర్ మండలం ధర్మపురం (Dharmapuram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది తగిలి కృష్ణ నేతృత్వంలో పాలమూరు యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థులు సృజన, విజయ్, ప్రశాంత్, వెంకటేష్, అరవింద్, స్నేహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది కృష్ణ మాట్లాడుతూ.. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగు, సాగు, విద్యుత్, ఇంధనం పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు పలు అంశాలపై విద్యార్థులకు ఫొటోల ద్వారా వివరించారు.
ప్రజలను చైతన్యపరుస్తూ..
ధర్మపురం ఉప సర్పంచి భోలే యాదయ్య మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాలని, గ్రామంలో ప్రజలను చైతన్యవంతపరుస్తూ ప్రతి ఒక్కరికి వాతావరణ ప్రతికూల పరిస్థితులను వివరిస్తామన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని నీటిని వృథా చేయొద్దన్నారు. ఎల్ నినో పరిస్థితులపై ప్రతికూల అంశాలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపే వాల్ పోస్టర్ ను పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ మాధవి వర్మ, ఇతర ఉపాధ్యాయులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పదో తరగతికి చెందిన వసంత అనే విద్యార్థిని కరువు పరిస్థితులపై మాట్లాడినందుకు న్యాయవాది కృష్ణ రూ.500 రూపాయల నగదు బహుమతిని అందజేశారు.

