తెలంగాణకు తక్షణమే రూ. 25వేల కోట్ల సాయం అందించాలి: కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో : కరువుతో అతలాకుతలమవుతున్న తెలంగాణను వెంటనే కరువు రాష్ట్రంగా ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 25 వేల కోట్ల సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు విడుదల చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కరువు సహాయక పనులు కొనసాగించాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో మంగళవారం సీపీఐ బృందం కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా తనికెళ్ల, కొణిజర్ల తదితర ప్రాంతాల్లో సాగు చేయని పొలాలు, ఎండిపోయిన పంటలు, అడుగంటిన భూగర్భ జలాలను పరిశీలించి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

​అనంతరం తనికెళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైందని, చెరువులు-కుంటలకు నీరు చేరకపోవడంతో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేశారు. వరి పంటకు ఎకరాకు రూ. 30,000, వాణిజ్య పంటలకు రూ. 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల లోపు రుణమాఫీ కాని రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయడంతో పాటు, అన్ని వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని కోరారు.

​రానున్న కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు కేటాయించాలని కూనంనేని సూచించారు. ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి, పనిదినాలు, కూలీ రేట్లను పెంచాలని, పశువులకు దాణా కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ప్రజలపై భారం మోపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రేషన్ షాపుల ద్వారా 14 రకాల వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న ప్రస్తుత పంటలను కాపాడటానికి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు దొండపాటి రమేష్, నాయకులు రవీంద్రబాబు, మిడికంటి వెంకటరెడ్డి, తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి గడల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>