కలం, మునుగోడు: రాబోయే 2028 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు గడ్డపై బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Theenmar mallanna) ధీమా వ్యక్తం చేశారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 41వ రోజు పాదయాత్రగా మునుగోడుకు చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మునుగోడు సెంటర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మల్లన్న మాట్లాడారు.
‘వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కానీ అస్సలు గ్రాడ్యుయేట్ ఓటే లేదు. గ్రాడ్యుయేట్ ఓటే లేని నేతలు మన ఓట్లు ఎలా అడుగుతారు? మీ ఓట్లు మాకు వద్దే వద్దు, మీతో సోపతీ వద్దు” అని తీన్మార్ మల్లన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ పార్టీ తరఫున ఉపాధ్యాయుడు పాలకూరి అశోక్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ, బీసీల ఐక్యత కోసం తన సొంత ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా త్యాగం చేసినట్లు చెప్పారు.
8 లక్షల ఓట్లు బీసీలవే..
ఈ నియోజకవర్గంలో 15 లక్షల పట్టభద్రుల ఓట్లలో 8 లక్షల ఓట్లు బీసీలవే ఉన్నాయని మల్లన్న తెలిపారు. రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా, లభిస్తున్న ప్రాతినిధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “లక్ష మంది లేని వెలమలకు 13 మంది ఎమ్మెల్యేలు, 10 లక్షల కంటే తక్కువ ఉన్న రెడ్లకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 2 కోట్లకు పైగా ఉన్న బీసీలు మాత్రం ఒక చిన్న ఎంపీటీసీ టికెట్ కోసం పార్టీల చుట్టూ తిరగాల్సి వస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల కేటాయింపులు, బడ్జెట్ వినియోగంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏడాదికి రూ.20,000 కోట్ల చొప్పున మూడేళ్లలో బీసీలకు ఖర్చు చేయాల్సిన రూ.60,000 కోట్లలో ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.2,000 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల పత్రాన్ని ప్రదర్శిస్తూ విమర్శించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తాం..
రాష్ట్రంలో 5 శాతమే ఉన్న అగ్రకులాలకు EWS ద్వారా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, 60 శాతం ఉన్న బీసీల నోట్లో మన్ను కొట్టారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మునుగోడులో ఉన్న 2,52,699 ఓట్లలో బీసీల ఓట్లే 1,37,000 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. బీసీల ఓట్లతో గెలిచి బీసీ నిధులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ‘కత్తెర’ గుర్తుతో ముందుకు వచ్చిందని, అగ్రకుల రాజకీయ అహంకారాన్ని కత్తిరించడానికి కత్తెరే సమాధానమని మల్లన్న పిలుపునిచ్చారు. 2028లో తెలంగాణలో బీసీల రాజ్యాధికార ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వైద్యం వెంకటేశ్వర్లు, మునుగోడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సతీష్ బాబు, పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్ ఛార్జ్ పూజిత, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అరుణ, నాయకులు కంటాల యాదగిరి, శేఖర్, రాణి, గొల్లకుర్మ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

