కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో (Jeedimetla) గంజాయి మ్యాచ్ వీరంగం సృష్టించింది. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద గంజాయి తాగుతూ అల్లరి చేస్తున్న ఇద్దరు యువకులను కాలనీ మహిళలు నిలదీయగా, వారు విచక్షణారహితంగా దాడికి దిగిన ఘటన కలకలం రేపింది.
పవన్ కల్యాణ్ (20), సంఘీ (20) అనే యువకులు జీడిమెట్లలోని (Jeedimetla) హనుమాన్ టెంపుల్ సమీపంలో బహిరంగంగా గంజాయి తాగుతూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు యువకులు బహిరంగంగా గంజాయి తీసుకుంటుండటంతో కొందరు మహిళలు నిలదీశారు.
ఆగ్రహించిన యువకులు “మమ్మల్నే అడుగుతావా?” అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ, మహిళలపై దాడి చేశారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో మహిళలు గాయపడగా, వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కాలనీవాసులు అందరూ కలిసి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, గంజాయి వినియోగం, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


