కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రా (Sahiti Infra) ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కీలక అడుగు వేశారు. సుమారు రూ. 3,000 కోట్ల మేర జరిగిన ఈ భారీ స్కామ్‌కు సంబంధించి పోలీసులు తాజాగా కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అభియోగ పత్రాన్ని సమర్పించడం గమనార్హం.
సాహితీ ఇన్‌ఫ్రా (Sahiti Infra) సంస్థ ‘ప్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో అమాయక పెట్టుబడిదారులను నమ్మించి వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంస్థపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం అమీన్‌పూర్ పరిధిలోని ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్టుకు సంబంధించిన 17 కేసులపై పోలీసులు ప్రాథమికంగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేవలం ఈ ఒక్క ప్రాజెక్టు పేరుతోనే సాహితీ యాజమాన్యం రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సాహితీ లక్ష్మీనారాయణతో పాటు మొత్తం 13 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. వినియోగదారుల నుంచి సేకరించిన భారీ మొత్తాన్ని ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాకుండా, లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విలాసవంతమైన జీవితం గడపడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులకు ఈ నిధులను మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు.
తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామన్న ప్రకటనలు నమ్మి మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల పొదుపును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగేళ్ల విచారణ అనంతరం పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్‌షీట్, బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశను చిగురింపజేస్తోంది.
Read Also: చైనా మాంజా విక్రయం.. సీపీ సీరియస్ వార్నింగ్
Follow Us On: Youtube


