అసలైన హంతకులను తక్షణమే అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం)

కలం, ఖమ్మం బ్యూరో: సామినేని రామారావు హత్య కేసులో అసలు నిందితులను కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా పోలీస్ అధికారి సునీల్ దత్ ప్రయత్నిస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు (Nunna Nageswara Rao) ఆరోపించారు. ఈ ప్రయత్నాలను తక్షణమే ఆపి, కేసును నీరుగార్చకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో NST రోడ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయన మాట్లాడారు.

సామినేని రామారావు (Samineni Rama Rao) హత్య అత్యంత దారుణమైన ఘటన అని నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, కుట్రదారులు, ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులను సమగ్ర దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అయితే, కేసు ప్రారంభం నుంచే రాజకీయ దురుద్దేశంతో కొందరిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జిల్లా పోలీస్ అధికారి మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నారని విమర్శించారు.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, హత్యకు పాల్పడిన అసలైన నిందితులతో పాటు హత్యకు కుట్ర పన్నిన వారిని కూడా గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో పారదర్శకత పాటించి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, నేరస్థులు ఎంతటి రాజకీయ పలుకుబడి కలిగిన వారైనా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, మడిపల్లి గోపాల్ రావు, వజేనేపల్లి శ్రీనువాసురావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>