నిర్మల్‌లో కవిత ‘టీ బ్రేక్‌’ వెనుక మర్మమేమిటి?

కలం, నిర్మల్ : ఇంద్రవెల్లిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న తెలంగాణ రక్షక సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) శుక్రవారం రాత్రి నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ఆగడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. నిర్మల్ పట్టణానికి చెందిన యువ వ్యాపారవేత్త పడిగెల కృష్ణ సంతోష్ నివాసంలో ఆమె తేనీటి విందులో పాల్గొని, కుటుంబ సభ్యులతో దాదాపు గంటపాటు గడిపారు. అయితే ఈ పర్యటన వెనుక కేవలం కుటుంబ అనుబంధమే ఉందా? లేక రాజకీయ కోణం కూడా ఉందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కుటుంబ అనుబంధమే కారణమా..?

కవితకు, కృష్ణ సంతోష్ కుటుంబానికి 2014 నుంచి పరిచయాలు ఉన్నాయని, ఆ అనుబంధం క్రమంగా కుటుంబ సంబంధంగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తమ నివాసానికి వచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారని సమాచారం. అయితే రాజకీయంగా కీలకమైన సమయంలో ఆమె నిర్మల్‌లో ఆగడం స్థానిక రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చలకు కారణమైంది.

మూడు నియోజకవర్గాలపై రాజకీయ చర్చ?

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఏర్పడే సమీకరణాలపై కవిత ఆసక్తి చూపుతున్నారా? స్థానికంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసే దిశగా ఆలోచిస్తున్నారా? అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షక సేన తరఫున కొత్త నాయకుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశాలపై కొందరు విశ్లేషించుకుంటున్నారు. అయితే, ఈ అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కృష్ణ సంతోష్ రాజకీయ అరంగేట్రం ఉంటుందా?

కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి పడిగెల కృష్ణ సంతోష్‌తో పరిచయం ఉందని, ఆ పరిచయం కుటుంబ అనుబంధంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణ సంతోష్ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే తెలంగాణ రక్షణ సేనలో కీలక బాధ్యతలు చేపడతారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అన్న ఊహాగానాలు స్థానికంగా మొదలయ్యాయి.

అయితే కేవలం కుటుంబ ఆతిథ్యాన్ని రాజకీయ పరిణామంగా భావించలేమని, ఈ పర్యటనకు సంబంధించి కవిత (TRS Chief Kavitha) లేదా కృష్ణ సంతోష్‌ గానీ ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేకపోవడం గమనార్హం. మొత్తానికి నిర్మల్‌లో టీఆర్ఎస్ చీఫ్ గంటపాటు సాగించిన టీ బ్రేక్‌ రాజకీయ వర్గాల్లో మాత్రం కొత్త చర్చకు దారితీసింది. ఈ ఆత్మీయ కలయిక భవిష్యత్తులో రాజకీయ బంధానికి దారితీస్తుందా? లేక కుటుంబ అనుబంధానికే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Also Read : ఎల్‌నినో ముప్పు: ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లకు స్పెషల్ ఫండ్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>