కలం, బజార్ హత్నూర్: బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శబరిమాత ఆలయంలో నిర్వహించిన శివాలయ (Shiva Temple) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి రూ. 21 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆలయానికి షెడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామ ప్రజల సౌకర్యార్థం బెంచీలు అందించిన 50 మంది దాతలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సమాజ అభివృద్ధిలో దాతల పాత్ర కీలకమని, వారి సేవలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

