కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎన్హెచ్ఎం జేఏసీ (NHM Employee JAC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం జేఏసీ కరీంనగర్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి గోదాం గడ్డ పోచమ్మ అమ్మవారి ఆలయం వరకు బోనాల శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తమ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి వినతిపత్రం సమర్పించి, తిరిగి సమ్మె శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

