కలం, ఖమ్మం బ్యూరో: విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతమాత్రం సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit ) హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని గుండాల మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను (Gundala Eklavya School) ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ నెలకొన్న లోపాలు, అక్రమాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయడంతో పాటు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వంట మనిషిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం..
పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో తరగతి గదుల్లో విద్యార్థులు లేకపోవడాన్ని కలెక్టర్ గుర్తించారు. పాఠశాల వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సాంస్కృతిక కార్యక్రమాలను సెలవు రోజుల్లో నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
వంట మనిషి తొలగింపు..
పాఠశాల మరుగుదొడ్లు తీవ్రంగా అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వంటశాల, స్టోర్ రూమ్‌ను పరిశీలించగా బంగాళాదుంపలు కుళ్లిపోయి ఉండటం, పంచదారలో చీమలు పట్టి ఉండటాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతారాహిత్యానికి కారణమైన వంట మనిషిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
బిర్యానీ ఎందుకు లేదు?
విద్యార్థులకు వడ్డిస్తున్న సాంబార్, రసం పలుచగా ఉండటాన్ని కలెక్టర్ గమనించారు. ఆరోజు ప్రభుత్వ మెనూ ప్రకారం బిర్యానీ వడ్డించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా భోజనం సిద్ధం చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేసి, విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన, పారిశుద్ధ్య లోపాలు, భోజన నాణ్యతలేమి, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
భూ రీసర్వే పనుల పరిశీలన..
ఈ పర్యటనలో భాగంగా గుండాల రెవెన్యూ పరిధిలో జరుగుతున్న భూ రీసర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. మొత్తం 10,390 ఎకరాల విస్తీర్ణంలో అటవీ గెజిట్ నిబంధనల ప్రకారం సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతుల సమక్షంలో హద్దులు నిర్ధారించి, నవంబర్ 15వ తేదీలోగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సిరంజీలు లేకపోవడంపై ఫైర్..
అనంతరం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అత్యవసర వైద్యానికి సిరంజీలు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి వైద్యాధికారులను ప్రశ్నించారు. మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి, మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధా, తహసీల్దార్ సంగీత, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీవో త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

