ఆరుతడి పంట‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, సేంద్రియ వ్యవసాయం, సమీకృత పంటల సాగు విధానాలను అవలంభించడం ద్వారా నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు రైతులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హితవు పలికారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఆర్మీ మాజీ ఉద్యోగి సీహెచ్.నవీన్ కుమార్ ‘జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్’ పేరిట నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం కలెక్టర్ త్రిపాఠి సందర్శించారు.

ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సమీకృత పంటల సాగు విధానాలను స్వయంగా పరిశీలించి, ఆదర్శ రైతు నవీన్ కుమార్ చేస్తున్న వినూత్న ప్రయోగాలను, కృషిని అభినందించారు. క్షేత్రంలో ఆకు కూరలు, వివిధ రకాల కూరగాయలు, పూల తోటలు, పండ్ల మొక్కలు, గానుగ, ఆయిల్‌పామ్, అరటి, కొబ్బరి సాగుతో పాటు చేపల పెంపకం, నాటుకోళ్ల పెంపకం వంటి విభిన్న వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలతో వివిధ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి, ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయాలు చేపడుతున్న విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం చేపడుతూ, వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్న విధానం, భూగర్భ జలాల పెంపు కోసం వర్షపు నీటి సంరక్షణకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిని గమనించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్మీలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి, ఆధునిక సాంకేతికతను సేంద్రియ వ్యవసాయంతో సమన్వయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నవీన్ కుమార్‌ను ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ దత్తాద్రి, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>