కలం, స్పోర్ట్స్: ఒక వైడ్ బాల్ వివాదం.. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ హరిస్ రౌఫ్ (Haris Rauf), ఆల్‌రౌండర్ విల్ జాక్స్ మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. రౌఫ్ బ్యాట్ చూపిస్తూ జాక్స్ వైపు దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్ చివరి బంతి వద్ద ఈ ఘటన జరిగింది. అప్పటికి షాదాబ్ ఖాన్ 99 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. సామ్ కరన్ వేసిన బౌన్సర్‌ను వైడ్‌గా ప్రకటించాలని షాదాబ్ కోరాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు.
ఈ సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రౌఫ్, జాక్స్‌తో మాటామాటా అనుకున్నాడు. వాగ్వాదం పెరగడంతో రౌఫ్ బ్యాట్‌ను జాక్స్ వైపు చూపిస్తూ ఆగ్రహంగా ముందుకు వెళ్లాడు. వెంటనే అంపైర్ అడ్డుపడ్డాడు. జో రూట్ కూడా రౌఫ్‌ను పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు కనిపించింది. పాకిస్థాన్ విజయం సాధించిన అనంతరం హ్యాండ్‌షేక్‌ల సమయంలోనూ ఇద్దరూ మరోసారి వాగ్వాదానికి దిగారు.
కాగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. తొమ్మిది వికెట్లు కోల్పోయిన దశ నుంచి షాదాబ్ ఖాన్ అజేయంగా 113 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. హరిస్ రౌఫ్‌తో కలిసి చివరి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ విజయంతో పాకిస్థాన్ ట్రై-సిరీస్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

