కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆయన 86వ వర్ధంతి (Komaram Bheem 86th Death Anniversary) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసి నాయకులు పాల్గొని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాంజీ గోండు విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సంప్రదాయాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొమురం భీమ్ కేవలం ఆదివాసులతో పాటు మొత్తం జిల్లాకే మంచి మార్గదర్శి అని, ఆయన కోరుకున్న ‘జల్, జంగల్, జమీన్’ సాధన కోసం అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోడు పట్టాలు, రైతు భరోసా, ఐటీడీఏ ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ ఫలాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే పిల్లలను బడికి క్రమం తప్పకుండా పంపాలని, మూఢనమ్మకాలకు పోకుండా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నందున నీటి సంరక్షణ అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చి, ఇంకుడు గుంతలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా నీటిని వృథా చేయకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

