కలం, వెబ్ డెస్క్: కుంభమేళాను తలపించేలా మేడారం సమ్మక్క సారలమ్మ ఆధునీకరణ పనులు చేపట్టామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. దాదాపు 200 కోట్ల రూపాయిలకు పైగా ఖర్చుతో ఆధునీకరణ పనులు చేపట్టామని, ఇప్పటికే దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. సోమవారం శాసనమండలిలో ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 200 ఏండ్లకుపైగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆధునీకరణపనులు చేపట్టామని వివరించారు. మేడారం చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే ఆధునీకరణ పనుల కోసం 29 ఎకరాల భూమిని అధికారికంగా సేకరించామని తెలిపారు.
భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో 63 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించామని వెల్లడించారు. ఈనెల 29 నుంచి 31 వరకు జరిగే మేడారం (Medaram) జాతర కోసం కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రులు కొండా సురేఖ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు. ఆధునీకరణ పనులను ప్రారంభించేందుకు ఈ నెల 18న సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్‌లను ఆహ్వానిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.


