కలం డెస్క్ : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) మండలిలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాను ఆమోదించాలంటూ కవిత చివరిసారిగా మండలిలో మాట్లాడారు. ‘పార్టీ నుంచి వివక్ష ఎదురైనా ప్రజలిచ్చిన బాధ్యతతో ధైర్యంగా ఉన్నాను. పార్టీలో ఎన్నో కట్టుబాట్ల ఆంక్షలను ఎదుర్కొన్నాను. నేను ప్రశ్నిస్తే నా మీద కక్షగట్టారు. పార్టీ అప్పగించిన పనులను మనస్ఫూర్తిగా పూర్తిచేశాను. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాకు వివక్ష ఎదురైంది. ప్రశ్నించినందుకు నన్ను అణగదొక్కారు. కేసీఆర్ చుట్టూ ఉన్నవారే నా మీద కక్షగట్టారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని నిలదీశా. అమరవీరుల కుటుంబాలకు జరిగిన అన్యాయం, ఆ విషయంలో జరిగిన అవినీతి గురించి పార్టీ దృష్టికి తీసుకెళ్ళాను. సచివాలయం నిర్మాణంలోనూ అవినీతి జరిగింది. పార్టీకి టీవీ ఛానెల్, పత్రిక ఉన్నా నాకు సపోర్టు ఇవ్వలేదు.ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. కొన్ని విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా బీఆర్ఎస్ హయాంలో న్యాయం జరగలేదు. పట్టించుకోలేదు. ఇసుక తవ్వకాల్లో అవినీతి, దందాలను ఆఫీసర్లకు చెప్పినా చర్యల్లేవ్’ అంటూ కవిత పేర్కొన్నారు.
నాలుగు కోట్ల మందికి 40 మంది ఎమ్మెల్సీలేనా ?
నాలుగు నెలలైనా తన రాజీనామాకు ఆమోదం ఇవ్వలేదని కవిత(Kavitha) పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. పెద్దల సభలో కూర్చోవడం పెద్ద గౌరవమన్నారు. తనకు ఓటేసి గెలిపించినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడానికి సంతోషంగా ఉన్నానన్నారు. తనకు నాకు మాట్లాడడానికి టైమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.‘బీఆర్ఎస్ నుంచి నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే రాజీనామా చేయాల్సి వస్తున్నది. నేను పూర్తి స్థాయిలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే నా రాజీనామాను ఆమోదించండి. పార్టీకి కూడా రిజైన్ చేశాను. 2006 నుంచి తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయాల్లో ఉన్నాను. సాంస్కృతికంగా రాష్ట్రంలో భావజాలవ్యాప్తికి కృషి చేశాను. ఊరూరా తిరిగి రాష్ట్ర ఏర్పాటు కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేశాను. మన భాష, యాసను కాపాడుకోడానికి కొట్లాడాను. స్వతంత్రంగానే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేశాను.’ అంటూ కవిత పేర్కొన్నారు. ‘నా దగ్గరకు కాంట్రాక్టర్లు రాలేదు. నేను పైరవీలు చేయలేదు‘ అంటూ కవిత పేర్కొన్నారు.
బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతా
రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతానని కవిత స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఎంత అవినీతి, అన్యాయం జరిగినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నేరెళ్లలో ఇసుక దందాలో దళితులు బాధితులుగా మిగిలిపోయారని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు పార్టీలో తన సహకారం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని , అందుకే పార్టీలో ఉండదల్చుకోలేదని కవిత అన్నారు. పార్టీకి, ఆ పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
కౌన్సిల్‌లో కవిత కన్నీళ్లు! MLC Kavitha’s Final Council Speech: Kavitha Emotional Farewell to Telangana Council (KAVITHA CRYING VIDEO) #Kavitha #BRS #TelanganaCouncil #KCR #KavithaResignation #MLCKavitha #kavitacrying #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/zyzvJNmM9u
— Kalam Daily (@kalamtelugu) January 5, 2026


