కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు (Harish Rao) సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈ కేసులో హరీశ్‌రావుపై ఉన్న ఎఫ్‌ఐఆర్ (FIR)ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేసు నేపథ్యం ఇదే..
హరీశ్ రావు (Harish Rao) ఆదేశాలతో గతంలో పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తూ హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన హైకోర్టు… ఫిర్యాదులో తగిన ఆధారాలు లేవని పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత కేసు అని కోర్టు అభిప్రాయపడింది. 2025 మార్చిలో హరీశ్ రావుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను కొట్టేయాలని కోరింది. సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని భావించిన సుప్రీంకోర్టు, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలు బలంగా లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. “సత్యమే జయించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై అక్రమ కేసులు పెట్టారు. న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.


