కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Assmebly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి సీతక్క మాట్లాడారు. ‘‘మహిళా సాధికారత, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. ప్రతి మహిళ సభ్యురాలుగా ఉండాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం’’ అని సీతక్క అన్నారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా 250 క్యాంటీన్లను ఏర్పాటుచేశాం. క్యాంటీన్ల (Canteens) నిర్వహణకుగానూ ఒక్కొక్కరికి రూ. 2320 చెల్లిస్తున్నాం. అలాగే వడ్డీలేని రుణాలు, ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. తెలంగాణలో పలు చోట్ల మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.’’ అని మంత్రి సీతక్క (Seethakka) వెల్లడించారు.


