కలం, ఖమ్మం బ్యూరో : శాసన సభను బాయ్ కాట్ చేసిన వాళ్లు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ (CPI Narayana ) డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం లోని గిరిప్రసాద్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను చర్చించకుండా వేతనాలు పొందటం ఎలా సాధ్యమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ తగదని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించాలని సూచించారు. పోలవరం, బనకచర్ల సాధ్యం కాదని.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల గురుశిష్యుల కథ ముగిసిందన్నారు.
సంపద కోసమే అమెరికా వెనెజువెలా పై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ దాడి చేయటాన్ని యావత్ ప్రజలు ఖండించాలని కోరారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు పస లేనివని వెనెజువెలాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా చేశారన్నారు. వెనెజువెలాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉందని, చర్చించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా ట్రంప్ ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. వెనెజువెలాపై దాడి భారత దేశానికి నష్టమని దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
బిజెపి, గాంధీ, నెహ్రూలను చరిత్ర నుండి చెరిపివేయాలని చూస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల కోసమే కమ్యూనిస్టులు పోరాడి సాధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. గాంధీజీని భౌతికంగా చంపేసిన సంఘ్ పరివార్ అనుకూలమైన వాళ్లు ఇప్పుడు గాంధీ పేరు మార్చాలనుకుంటున్నారన్నారు. 40 కుటుంబాల కోసం 28 లక్షల కోట్ల రూపాయల రాయితీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 85 కోట్ల మందికి 10 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు జంకుతుందని ఆరోపించారు. జిఎస్టి రూపంలో దోపిడీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఈజిఎస్ పథకం మార్పును ఉపసంహరించుకోవాలని CPI Narayana డిమాండ్ చేశారు
జనవరి 18న చారిత్రిక సభ
జనవరి 18న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా చారిత్రక సభ జరుగుతుందని నారాయణ తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభలో దేశ విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారని 15 రోజుల పాటు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సభలు, సమావేశాలు, సదస్సులు జరుగుతాయన్నారు. కమ్యూనిస్టులు పురోగమించక తప్పదని, మతోన్మాద శక్తులను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం, సిద్ధాంతాన్ని కనుమరుగు చేయడం ఎవరి తరం కాదన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూ పంపిణీ జరిగిందని, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.


