కలం, వెబ్‌డెస్క్: తమ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (Grok ai controversy) లో అసభ్య కంటెంట్‌పై ఎలాన్ మస్క్ సంస్థ ‘ఎక్స్’ స్పందించింది. ఆ కంటెంట్ తొలగిస్తామని, పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’కు చెందిన ‘ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్’ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, ‘ఎక్స్’ అనుబంధ గ్రోక్, ఎక్స్ఏఐలో మహిళలు, చిన్నపిల్లల ఫొటోలతో అసభ్య కంటెంట్ క్రియేట్ చేసి, దాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మనదేశంలో శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది రెండు రోజుల కిందట కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి ‘ఎక్స్’ భారత ప్రతినిధికి నోటీసులు జారీ చేసింది. అసభ్య కంటెంట్ తొలగించాలని, దీనిపై తీసుకున్న చర్యలను 72 గంటల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ‘ఎక్స్’ స్పందించింది. అంతకుముందు ఎలాన్ మస్క్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ, గ్రోక్(Grok ai controversy) ను ఉపయోగించి అశ్లీల కంటెంట్ తయారీకి ప్రాంప్ట్ ఇచ్చినవాళ్లపై, ఆ కంటెంట్‌ను అప్లోడ్ చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


