epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అసోం స్క్రీనింగ్ కమిటీలో ప్రియాంక

కలం డెస్క్ : కాంగ్రెస్ ఫేస్‌గా ప్రియాంకాగాంధీకి (Priyanka Gandhi) పార్టీలో మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆమెను తొలిసారి స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా హైకమాండ్ ఫైనల్ చేసింది. ఇలాంటి స్క్రీనింగ్ కమిటీల్లో గాంధీ ఫ్యామిలీకి చోటు కల్పించడం ఇదే ఫస్ట్ టైమ్. ఆమె తన అదృష్టాన్ని ఈశాన్య దిక్కు నుంచి పరీక్షించుకోబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులు కావడం గమనార్హం. ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ ఇటీవల కామెంట్లు చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సహరన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా ఆ కమిటీలో సభ్యులు. ఆసోంలో నియోజకవర్గాలవారీగా దీటైన అభ్యర్థులను ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపడం స్క్రీనింగ్ కమిటీ కీలక బాధ్యత. మొత్తం నలుగురితో కూడిన కమిటీ ఆ రాష్ట్ర ఎలక్షన్ స్ట్రాటెజీకి అనుగుణంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తుంది.

సంకీర్ణ రాజకీయాలతో కాంగ్రెస్ హోప్ :

సంకీర్ణ రాజకీయాలకు అసోం పెట్టింది పేరు. ఏ రాజకీయ పార్టీ కూడా సింగిల్‌గా పోటీ చేయడంకంటే ప్రధాన జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేయడం ఆనవాయితీ. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహజోత్ ప్రధాన ప్రత్యర్థులుగా పోటీపడ్డాయి. మొత్తం 126 సభ్యులున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ 75 సీట్లు, మహజోత్ 50 సీట్ల చొప్పున గెలిచాయి. ఎన్డీఏకు 43.9% ఓట్ షేర్ వస్తే, మహజోత్‌కు 42.3 షేర్ వచ్చింది. కేవలం 1.6% తేడాతో మహజోత్ అధికారంలోకి రాలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలం అనుబంధమే ఉన్నది. తరుణ్ గగోయ్ పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు గౌరవ్ గగోయ్ ఎంపీగా గెలిచారు. లోక్‌సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. రాహుల్‌గాంధీకి కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు.

 Priyanka Gandhi కి బాధ్యతలపై ఆశలు :

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫేస్‌గా గౌరవ్ గగోయ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కానీ అక్కడి పార్టీలో వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి తదితర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో ప్రియాంకాగాంధీ ఎంట్రీ ఇచ్చారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలిగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి 1:3 నిష్పత్తిలో ఏఐసీసీ ఎలక్షన్ కమిటీకి పంపించడం ఈ కమిటీ బాధ్యత. ఇందులో ఒకరిని హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ప్రస్తుతం గౌరవ్ గగోయ్ ఒక్కరే సరిపోరనే భావనతో పార్టీ హైకమాండ్ ప్రియాంకాగాంధీకి స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు అప్పజెప్పింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్ షేర్‌ను, ఓడిపోవడానిక కారణాలను విశ్లేషించి ఈసారి బంధుప్రీతి లాంటి అంశాలకు తావు లేకుండా కేవలం విజయావకాశాలే ప్రాతిపదికగా అభ్యర్థులను ఆమె ఖరారుర చేయనున్నారు. ఇప్పుడు వచ్చే ఫలితాలు రానున్న రోజుల్లో అసోం సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు పార్టీపై నమ్మకాన్ని పెంచడానికి దోహదం చేసే అవకాశాలున్నాయి.

యంగ్ లీడర్‌షిప్‌పైనే ప్రజల నమ్మకం :

ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మ (బీజేపీ) ఒకప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ ఫేస్ కూడా. ఇప్పుడు బీజేపీ పాలిటిక్స్ ను తిప్పికొట్టడానికి గౌరవ్ గగోయ్ ఇమేజ్ మాత్రమే సరిపోదని, ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక అంశాల రీత్యా బలమైన వాయిస్ వినిపించేలా ప్రియాంకాగాంధీని ఎంపిక చేసింది హైకమాండ్. గత ఎన్నికల్లో కేవలం 1.6% ఓట్ షేర్ మొత్తం ఫలితాలనే తారుమారు చేయడంతో ఈసారి ఆ గ్యాప్‌ను భర్తీ చేయడం ప్రియాంకాగాంధీ ముందున్న మేజర్ టాస్క్. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించి గెలిపించుకోవడం కీలకమైన అంశం. ఇటీవల లోక్‌సభలో ప్రియాంకాగాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు అసోం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను తగ్గించవచ్చన్నది పార్టీ అభిప్రాయం.

ఈశాన్యం కాంగ్రెస్‌‌కు శుభసూచకమా? :

గత పార్లమెంటు ఎన్నికల్లో భారత్ జోడో యాత్రతో దేశమంతా తిరిగిన రాహుల్‌గాంధీ ప్రభావం కాంగ్రెస్‌కు కాస్త కలిసొచ్చింది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నది. ఇప్పుడు అసోంలో పార్టీ గెలుపు మొత్తం ఈశాన్య రాష్ట్రాలనే ప్రభావితం చేస్తుందన్నది పార్టీ భావన. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని తూర్పారబట్టిన ప్రియాంకాగాంధీ ఇప్పుడు తన పదునైన స్పీచ్‌పై ఆ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగాలకు ఆమె దీటుగా సమాధానం చెప్తారని, అది ఓటర్ల మైండ్‌సెట్‌పై ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఉన్నది. సుదీర్ఘకాలం పాటు తరుణ్ గగోయ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం, ఇప్పుడు ఆయన కుమారుడు గౌరవ్ గగోయ్‌కు ఉన్న గుర్తింపుతో పాటు ప్రియాంకాగాంధీ ఇమేజ్ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Priyanka Gandhi
Priyanka Gandhi

Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం.. 2,100 కిలో మీటర్ల జర్నీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>