కలం వెబ్ డెస్క్ : తెల్లజుట్టు(Grey Hair).. ప్రస్తుతం చాలా మందికి చిన్న వయసులోనే వస్తుంది. తెల్లజుట్టు వచ్చిందంటే.. యువత చాలా ఇబ్బంది పడతారు. దానిని చూసి తమను ముసలి వాళ్లు అనుకుంటారని భావిస్తారు. ఆ తెల్లజుట్టు తగ్గించుకోవడానికి, దాచి పెట్టడానికి నానా తిప్పలు పడుతుంటారు. కానీ తాజా అధ్యయనం(Medical Study) ఒకటి.. షాకింగ్ విషయాలు చెప్తుంది. బహుశా మనల్ని రక్షించే క్రమంలోనే తెల్లజుట్టు వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తోంది. కొత్త అధ్యయనం ప్రకారం జుట్టు తెల్లబడటం శరీరం క్యాన్సర్ నుంచి తనను తాను సమర్థంగా కాపాడుకుంటున్న సంకేతంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అల్ట్రావయలెట్ కిరణాలు, కొన్ని రసాయనాల వంటి క్యాన్సర్‌ను ప్రేరేపించే అంశాలు శరీరంలో సహజ రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేస్తాయని పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రక్రియ కారణంగా జుట్టు ముందుగానే తెల్లబడినా క్యాన్సర్ వచ్చే అవకాశం మాత్రం తగ్గుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
జుట్టుకు రంగును ఇచ్చే పిగ్మెంట్ ఉత్పత్తికి బాధ్యత వహించే స్టెమ్ సెల్స్ భవితవ్యాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో డీఎన్ఏ(DNA)కు నష్టం వాటిల్లినప్పుడు ఈ కణాలు రెండు విధాలుగా స్పందించినట్టు గుర్తించారు. ఒక సందర్భంలో అవి పెరుగుదల, విభజన ఆపేసి జుట్టు తెల్లబడే పరిస్థితికి దారి తీశాయి. మరో సందర్భంలో నియంత్రణ లేకుండా విభజన కొనసాగించి చివరకు ట్యూమర్‌గా మారాయి.
ఈ పరిశోధన ఫలితాలు అక్టోబర్ నెలలో నేచర్ సెల్ బయాలజీ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. వయస్సు పెరిగే కొద్దీ డీఎన్ఏ నష్టం, వ్యాధుల నుంచి రక్షణకు ఇలాంటి సహజ యంత్రాంగాలు ఎంత కీలకమో ఈ అధ్యయనం తెలియజేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
క్యాన్సర్ రక్షణగా జుట్టు తెల్లబడటం
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల జుట్టు కుదుళ్లలో నిరంతరం పునరుత్పత్తి అయ్యే స్టెమ్ సెల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రంలోని చిన్న భాగంలో మెలానోసైట్ స్టెమ్ సెల్స్ నిల్వగా ఉంటాయి. ఇవే జుట్టుకు రంగు ఇచ్చే మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తి చేసే కణాలకు మూలం. ప్రతి జుట్టు పెరుగుదల చక్రంలో ఈ మెలానోసైట్ స్టెమ్ సెల్స్ విభజన ద్వారా పరిపక్వ కణాలను ఉత్పత్తి చేస్తాయని లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన సెల్ బయాలజిస్ట్ డాట్ బెన్నెట్ వివరించారు. ఈ కణాలు జుట్టు రంధ్రం అడుగుకు చేరి పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఈ కణాలు తగినంత పిగ్మెంట్ ఉత్పత్తి చేయలేని దశకు చేరుకున్నప్పుడు జుట్టు తెల్లబడుతుంది. దీనిని సెల్ సెనెసెన్స్ అనే కణాల అలసట స్థితిగా బెన్నెట్ వివరించారు. ఇది కణం ఎన్ని సార్లు విభజించుకోవచ్చో నిర్ణయించే సహజ పరిమితి అని, కాలక్రమంలో ఏర్పడే జన్యు లోపాలు నియంత్రణ లేకుండా వ్యాప్తి చెందకుండా అడ్డుకునే క్యాన్సర్ నిరోధక విధానమని ఆమె తెలిపారు.
ఈ దశకు చేరుకున్నప్పుడు మెలానోసైట్ స్టెమ్ సెల్స్ పూర్తిగా విభజన ఆపేస్తాయి. ఫలితంగా జుట్టుకు రంగు ఇచ్చే పిగ్మెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది. సాధారణంగా ఇది వృద్ధాప్యంలో జరుగుతుంది. అయితే టోక్యో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎమీ నిషిమురా, ఆమె బృందం.. డీఎన్ఏ నష్టం వంటి పరిస్థితుల్లో ఇదే ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేయాలనుకున్నారు.
ఎలుకలపై చేసిన పరిశోధనల్లో అయానైజింగ్, రేడియేషన్ క్యాన్సర్ కారక రసాయనాలకు గురైన తర్వాత ఒక్కో మెలానోసైట్ స్టెమ్ సెల్ ఎలా స్పందిస్తుందో పరిశీలించారు. నష్టం రకం ఆధారంగా కణాల ప్రతిస్పందన మారుతుందని వారు గుర్తించారు.
అయానైజింగ్ రేడియేషన్ స్టెమ్ సెల్స్‌ను పరిపక్వ దశకు నడిపించి సెల్ సెనెసెన్స్ మార్గాన్ని ప్రారంభించింది. దీని వల్ల స్టెమ్ సెల్ నిల్వలు వేగంగా తగ్గి జుట్టు తెల్లబడింది. అదే సమయంలో ఈ మార్గం దెబ్బతిన్న డీఎన్ఏ కొత్త కణాలకు చేరకుండా అడ్డుకుని క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించింది.
అయితే 7, 12 డైమెథైల్బెంజ్ ఏ ఆంథ్రాసీన్ వంటి రసాయన క్యాన్సర్ కారకాలు ఈ రక్షణ వ్యవస్థను దాటవేశాయి. ఇవి సెల్ సెనెసెన్స్‌ను అడ్డుకుని మరో కణ మార్గాన్ని క్రియాశీలం చేశాయి. ఫలితంగా జుట్టు రంగు కొనసాగినా దెబ్బతిన్న డీఎన్ఏ నియంత్రణ లేకుండా విభజించుకుని చివరకు ట్యూమర్లుగా మారే ప్రమాదం పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు.
ఒకే స్టెమ్ సెల్ సమూహం ఎదురయ్యే ఒత్తిడి రకాన్ని బట్టి పూర్తిగా భిన్నమైన ఫలితాలకు దారి తీస్తుందని ఎమీ నిషిమురా తెలిపారు. జుట్టు తెల్లబడటం మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ వేర్వేరు అంశాలు కాకుండా స్టెమ్ సెల్ ఒత్తిడి ప్రతిస్పందనల నుంచి ఏర్పడే భిన్న ఫలితాలుగా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై ఈ అధ్యయనాన్ని మానవ జుట్టు రంధ్రాలపై ప్రయోగించి ఎలుకలలో కనిపించిన ఫలితాలు మనుషులకూ వర్తిస్తాయో లేదో పరిశీలించాల్సి ఉందని డాట్ బెన్నెట్ తెలిపారు.


