కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్, భారత్ మధ్య రాజకీయాల్లోనే కాకుండా క్రికెట్‌లో కూడా సంబంధాలు సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. తాజాగా కేకేఆర్ జట్టు నుంచి బంగ్లాదేశ్ (Bangladesh) పేసర్ ముస్తఫిజుర్‌ను విడుదల చేయలంటూ బీసీసీఐ (BCCI) ఆదేశించడంతో.. కేకేఆర్ అతడిని రిలీజ్ చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో తమ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని అధికారికంగా కోరడం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారంపై బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ స్పందించలేదు. కానీ బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాత్రం ఘాటుగా స్పందించారు. భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని బీసీబీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భారత్‌లో ఒక ఆటగాడు ఒప్పందం ఉన్నప్పటికీ ఆడలేని పరిస్థితి ఉంటే వరల్డ్ కప్ కోసం జట్టు భారత్‌కు రావడం సురక్షితం కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు.
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 9న ఇటలీతో ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 17న నేపాల్‌తో మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ డిమాండ్‌పై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. వేదికలు మార్చడం అసాధ్యమని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే జట్ల ప్రయాణాలు హోటల్ బుకింగులు ప్రసార ఏర్పాట్లు ఖరారైన నేపథ్యంలో ఇలాంటి మార్పులు చేయడం లాజిస్టిక్ నైట్‌మేర్‌గా మారుతుందని తెలిపారు. చెప్పడం సులువు అయినా అమలు చేయడం సాధ్యం కాదని బీసీసీఐ (BCCI) తేల్చిచెప్పింది.


