epaper
Friday, January 16, 2026
spot_img
epaper

విమానాల్లో వాటిపై నిషేధం.. డీజీసీఏ కీలక నిర్ణయం..

కలం, వెబ్ డెస్క్: విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) (DGCA) కీలక నిర్ణయం తీసుకున్నది. విమాన ప్రయాణాల్లో పవర్‌బ్యాంక్‌లు, లిథియం బ్యాటరీల వినియోగంపై నిషేధం విధించింది. విమానాల్లో ప్రయాణించే సమయంలో పవర్‌బ్యాంక్‌ల ద్వారా మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. సీటు వద్ద ఉన్న పవర్ అవుట్‌లెట్ల ద్వారా కూడా ఛార్జింగ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. లిథియం బ్యాటరీలు వేడెక్కడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే అనుమతి

గత ఏడాది నవంబర్‌లో విడుదల చేసిన ‘డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్’లో పవర్‌బ్యాంక్‌లు, అదనపు బ్యాటరీలు కేవలం హ్యాండ్ బ్యాగ్‌లోనే తీసుకెళ్లాలని డీజీసీఏ ఆదేశించింది. ఓవర్‌హెడ్ లగేజ్ కంపార్ట్‌మెంట్‌లలో వాటిని ఉంచరాదని స్పష్టం చేసింది. అక్కడ మంటలు చెలరేగితే గుర్తించడం, నియంత్రించడం కష్టమవుతుందని DGCA పేర్కొంది.

లిథియం బ్యాటరీలు ఎందుకు ప్రమాదకరం?

లిథియం బ్యాటరీలు అత్యంత శక్తివంతమైనవిగా ఉండటంతో మంటలు చెలరేగితే తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని డీజీసీఏ హెచ్చరించింది. “రీచార్జ్ అయ్యే పరికరాల్లో లిథియం బ్యాటరీల వినియోగం పెరగడంతో విమానాల్లో వాటి రవాణా అధికమైంది. పవర్‌బ్యాంక్‌లు, పోర్టబుల్ ఛార్జర్లు వంటి పరికరాలు మంటలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇవి విమానంలో అగ్నిప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది” అని సర్క్యులర్‌లో పేర్కొంది. ఓవర్‌హెడ్ బిన్లలో లేదా క్యారీ-ఆన్ బ్యాగేజీలో ఉంచిన లిథియం బ్యాటరీలు ప్రయాణికులు లేదా సిబ్బందికి కనిపించకుండా ఉండే అవకాశముందని, దీంతో పొగ లేదా మంటలను ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉందని డీజీసీఏ వివరించింది. ఓవర్‌చార్జింగ్, లోపభూయిష్ట తయారీ, పాత బ్యాటరీలు లేదా నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్ల లిథియం బ్యాటరీల్లో మంటలు చెలరేగవచ్చని పేర్కొంది. ఈ మంటలు సాధారణ అగ్నిప్రమాదాలకంటే తీవ్రంగా ఉండి, ప్రత్యేక విధానాలతోనే నియంత్రించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

భద్రతా తనిఖీలు, సిబ్బంది శిక్షణ పెంచాలని ఆదేశాలు

ప్రయాణికులు తీసుకెళ్లే లిథియం బ్యాటరీలపై ఉన్న భద్రతా రిస్క్ అసెస్‌మెంట్‌లను ఎయిర్‌లైన్స్ పునఃసమీక్షించాలంటూ డీజీసీఏ ఆదేశించింది. విమాన క్యాబిన్‌లో బ్యాటరీల వల్ల మంటలు చెలరేగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. క్యాబిన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, పరికరాలు వేడెక్కడం, పొగ రావడం, మంటలు చెలరేగడం వంటి లక్షణాలను తొందరగా గుర్తించేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. అగ్నిమాపక పరికరాలు, రక్షణ సామగ్రి తగినంతగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. విమానాల్లో ప్రయాణికులకు కొత్త నిబంధనలపై తప్పనిసరిగా సూచనలు చేయాలని డీజీసీఏ సూచించింది. ఏదైనా పరికరం నుంచి అధిక వేడి, పొగ లేదా అసాధారణ వాసన వస్తే వెంటనే క్యాబిన్ సిబ్బందికి తెలియజేయాలని ప్రయాణికులకు సూచించాలని తెలిపింది. లిథియం బ్యాటరీల కారణంగా జరిగే ప్రతి భద్రతా ఘటనను డీజీసీఏకు వెంటనే నివేదించాలని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

విమానాశ్రయాల్లో హెచ్చరికలు

విమానాశ్రయాల ప్రవేశద్వారాలు, చెక్-ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, బోర్డింగ్ గేట్ల వద్ద లిథియం బ్యాటరీల ప్రమాదాలపై హెచ్చరికల సందేశాలు, వీడియోలు ప్రదర్శించాలని విమానాశ్రయ నిర్వాహకులను డీజీసీఏ ఆదేశించింది. బోర్డింగ్‌కు ముందు పవర్‌బ్యాంక్‌లు ఛార్జ్ చేయడాన్ని నివారించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో లిథియం బ్యాటరీల కారణంగా భద్రతా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు డీజీసీఏ తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్న పరిస్థితుల్లో, బ్యాటరీల వల్ల మంటలు చెలరేగకుండా నివారించేందుకు కఠిన తనిఖీలు, మెరుగైన శిక్షణ, ప్రయాణికుల అవగాహన అవసరమని పేర్కొంది. ఇదివరకే ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి పరిమితులు విధించాయి. గత అక్టోబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో టాక్సీయింగ్ సమయంలో దిమాపూర్‌కు వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్‌కు మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. అలాగే ఈ ఏడాది జనవరిలో దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ విమానం దగ్ధమవగా, అందుకు పవర్‌బ్యాంక్ కారణమై ఉండొచ్చని దర్యాప్తులో వెల్లడైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>