కలం, మునుగోడు: గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కార్మికులందరికీ (Toddy Tappers) తక్షణమే లైసెన్సులు, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల నిరంజన్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, గీత సొసైటీల బలోపేతానికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. మంగళవారం మర్రిగూడ (Marriguda) మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గీత పనివారల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ సత్యం, సీపీఐ మండల కన్వీనర్ బుర్ర శేఖర్‌తో కలిసి నిరంజన్ గౌడ్ మాట్లాడారు. గీత కార్మికులకు ప్రస్తుతం అందిస్తున్న పింఛన్‌ను నెలకు రూ.5,000కు పెంచాలని, కఠిన నిబంధనలు లేకుండా అర్హులైన ప్రతి కార్మికుడికి పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తాటి, ఈత చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించే గీత కార్మికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. నిలిచిపోయిన ప్రమాద బీమా ప్రీమియం నిధులను వెంటనే విడుదల చేయాలని, కార్మికుల ప్రాణరక్షణ కోసం ఆధునిక సేఫ్టీ కిట్లను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తైన చెట్లు ఎక్కేందుకు ఉపయోగపడే సేఫ్టీ క్లైంబింగ్ యంత్రాలను సబ్సిడీపై అందించాలని కోరారు.
గీత కార్మికుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని, సొంత ఇళ్లు లేని పేద కార్మికులకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు. గీత పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి, కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే వారిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సంఘ ప్రతినిధులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

