జలసిరి ప్రచారంలో నరసింహపురం కొత్త బాట

కలం, మునగాల: నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి, భవిష్యత్ తరాలకు జలవనరులను అందించాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహపురం(Narasimhapuram) గ్రామంలో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ, మహిళలకు కుంకుమ తిలకాలు దిద్దుతూ గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, బోరుబావులకు రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

మండల ఎంపీఓ నరేష్ మాట్లాడుతూ.. నరసింహపురంలో మంగళ వాయిద్యాలతో చేపట్టిన ఈ వినూత్న అవగాహన ప్రచారం జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. సాంకేతిక సహాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జలసిరి పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>