మూడవ రోజు.. అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. గాయత్రీదేవిగా భద్రకాళీ

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జగన్మాత శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. నవదుర్గల అవతారంలో జగన్మాత లలితాపరాభట్టారిక దర్శనమిస్తున్నారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో దేవాలయ దర్శనం చేసి పూజలు చేస్తున్నారు. ఏపీలోని ప్రముఖ పుణ్యతీర్థం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి (Vijayawada Kanaka Durga) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కృష్ణానదీ తీరాన స్నానాలు చేసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా వెలిగిపోతుంది.

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు విశేష పూజలు అందుకుంటున్నారు. వివిధ అవతారలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు..  రెండవరోజు క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవి రూపంలో దర్శనమిచారు.  ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మొదటి రోజు లక్ష నలబై వేల మంది భక్తులు వచ్చారు. రెండవ రోజు కూడా దాదాపు లక్షన్నర మంది భక్తులు వచ్చారు. ఇక మూడవ రోజైన మంగళవారం దుర్గమ్మఅన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుఝామున 3 గంటల నుంచే భక్తులు వేచి చూస్తున్నారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో దసరా  శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు భద్రకాళీ అమ్మవారు  గాయత్రీదేవిగా భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజరారాజేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

శ్రీశైలంలోను శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం చంద్ర ఘంట అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనమివ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.  అటు హైదరాబాద్ లోని  బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం అమ్మవారు శ్రీ మంగళ గౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పండితులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>