కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. మహారాష్ట్రలోని దిగువ కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ పై అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించింది.
ఈ కేసుకు సంబంధించి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు, ఈ విషయమై నాలుగు వారాల్లోగా తమ సమాధానం సమర్పించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేసింది.
2018లో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం వివాదం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర కోర్టులో క్రిమినల్ మానహాని కేసు నమోదై విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను గతంలో బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో దిగువ కోర్టులో ప్రక్రియలన్నీ ప్రస్తుతానికి నిలిచిపోయాయి.

