కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్న యువతకు అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ (CMOES) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది 2026–27లో సుమారు 7 వేల మంది యువతకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ పథకం ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులకు వీసా, విమాన ప్రయాణం, విదేశీ భాషల శిక్షణ ఖర్చుల్లో 50 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. నేరుగా విదేశీ ఉద్యోగాలు పొందేవారికి గరిష్ఠంగా రూ.50 వేల వరకు, విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరమున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు.
అలాగే, మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. 18-40 ఏళ్ల మధ్య వయసుతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాలు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. TOMCOM ఏర్పాటు చేయనున్న ప్రత్యేక పోర్టల్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల పర్యవేక్షణలో అర్హులైన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Also Read : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ
Follow Us On : WhatsApp

