పాలకవర్గం లేకుండానే పోచమ్మతల్లి గంగనీళ్ల జాతర.. ఏర్పాట్లపై సందిగ్ధం!

కలం, సారంగాపూర్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. భక్తులపై అనురాగం కురిపించే అమ్మగా.. నిర్మల్‌ జిల్లా ప్రజల ఇలవేల్పుగా పేరొందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మతల్లి గంగనీళ్ల జాతర (Adelli Pochamma Thalli Ganga neella Jatara) సమీపిస్తోంది. సారంగాపూర్‌ మండలం అడెల్లి గ్రామంలోని అమ్మవారి ఆలయంలో శని, ఆదివారాల్లో జాతర జరగనుంది. అయితే ఆలయానికి నూతన పాలకవర్గం లేకపోవడంతో నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. జాతరకు సమయం దగ్గరపడుతున్నా ధర్మకర్తల నియామకం కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలలుగా పాలకవర్గం ఖాళీ..

ఆలయ పాలకవర్గం పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి ఇంచార్జి కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలోనే ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చే జాతర సమయంలో పాలకవర్గం లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పన, వివిధ కార్యక్రమాల నిర్వహణలో పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో నూతన పాలకవర్గం ఏర్పాటు కాకపోవడంతో జాతర నిర్వహణ ఎలా సాగుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

52 మంది దరఖాస్తులు.. అయినా నియామకం ఎప్పుడు?

అమ్మవారికి సేవ చేసేందుకు నూతన ధర్మకర్తల నియామకం కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ జూన్‌ 17న నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 52 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు శాఖ విచారణ సైతం పూర్తయినట్లు తెలిసింది. విచారణ నివేదికను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సహాయ కమిషనర్‌కు పంపగా, అక్కడి నుంచి దేవాదాయ కమిషనర్‌కు చేరినట్లు సమాచారం. అయినప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై దరఖాస్తుదారులు, భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం అనుమతించి దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేస్తే, ఎక్స్‌ అఫీషియో పూజారితో కలిపి 14 మందితో నూతన పాలకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

జాతర ముంగిటా.. ప్రచారంలో జాప్యం..

జాతరకు సమయం దగ్గరపడుతున్నా ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా జాతరకు ముందుగా భక్తులకు సమాచారం అందించేందుకు ముద్రించే కరపత్రాలు, పోస్టర్ల విషయంలోనూ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. పాలకవర్గం ఏర్పాటుపై స్పష్టత వస్తుందనే ఎదురుచూపుల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు వెనుకబడినట్లు చర్చ జరుగుతోంది.  మరోవైపు ఆలయ అధికారులు జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం స్పందించేనా..

అమ్మవారి జాతర భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణ, పోలీసు విచారణ పూర్తయినట్లు సమాచారం ఉన్నందున ధర్మకర్తల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? జాతర సమయానికి నూతన పాలకవర్గం కొలువుదీరుతుందా? అన్నది వేచి చూడాలి. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి జాతరను సజావుగా నిర్వహించడంతో పాటు, ధర్మకర్తల నియామకంపై స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>