కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంచార్జ్ బీఎం సందీప్‌తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సందీప్‌తో జరిగిన భేటీలో తాను ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించలేదని , తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి ఫిర్యాదులు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్టించుకోవాలని కోరారు.
పార్టీ కోసం కష్టపడిన నాయకులను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సందీప్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రజలకు, కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో ఎక్కడైనా బ్యాలెన్స్ లోపిస్తే పరిశీలించి, వెంటనే ఆ పనులు జరిగేలా చూడాలని సూచించినట్లు జగ్గారెడ్డి వివరించారు. డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కట్టడిపై ఉక్కుపాదం మోపారని ఆయన గుర్తు చేశారు.
విద్యా సంస్థల్లోనూ గంజాయి మూలాలను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, డ్రగ్స్ తీసుకున్న వారు ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించకుండా సీఎం రేవంత్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో నిరంతరం పని చేయిస్తుంటే, కిషన్ రెడ్డి ఇప్పుడు తీరిగ్గా కళ్లు తెరిచారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే గంజాయి, డ్రగ్స్‌పై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపిన తర్వాత కిషన్ రెడ్డి పాదయాత్ర చేయడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి చేస్తున్నది కేవలం ఎన్నికల యాత్ర మాత్రమేనని, అదంతా ఒక ‘షో పుటప్’ యాత్ర అని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

