కలం, కరీంనగర్ బ్యూరో: వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం కేవలం రూ.10 నామినల్ ఫీజుతో ఎండీ వైద్యుల కన్సల్టేషన్ అందించడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ స్ట్రీట్లో వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వాసవి హాస్పిటల్’ను (Vasavi Hospital) ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.
ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించి, పేదలకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఇప్పటికే వాసవి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో కేవలం రూ.10 ఫీజుతో ఎండీ కన్సల్టేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
రెడ్ క్రాస్ సొసైటీ తరహాలోనే వాసవి హాస్పిటల్లోనూ అతి తక్కువ ధరకే రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఇన్-పేషెంట్ సదుపాయంతో పాటు సర్జికల్ వార్డులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. మెడిసిన్లో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ అఖిల, డాక్టర్ అనూష, డాక్టర్ శివానిల బృందం ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

