కలం, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో వరుస ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ (Jantar Mantar)కు నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు కేటాయించిన అధికారిక వేదికగా ఉన్న గుర్తింపును రద్దు చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఈ నిర్ణయానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంతకాలం ధర్నా చౌక్ తరహాలో కొనసాగిన జంతర్ మంతర్‌ను ఇకపైన అలాంటి నిరసనలకు వేదికగా ఉండదంటూ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జంతర్ మంతర్ వేదికగా ఎలాంటి ధర్నాలకు, నిరసనలకు అనుమతి లేదని, దాన్ని ధర్నా చౌక్‌గా ఇకపైన పరిగణించలేమని స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) జారీ చేశారు. ఇకపైన ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేయాలనుకుంటే ఎర్రకోట సమీపంలో ఉన్న రామ్‌లీలా మైదాన్ (Ramlila Ground) లేదా ఉత్తర ఢిల్లీలో షహద్రా దగ్గర ఉన్న సీబీడీ గ్రౌండ్స్ (CBD Ground) లేదా ఈస్ట్ ఢిల్లీలో ఉన్న సీమీఐడీ గ్రౌండ్స్ ఎంచుకోవాలని స్పష్టం చేశారు.
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా నిరసనలకు, ధర్నాలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్ (Jantar Mantar) ప్లేస్‌ను అలాంటి కార్యకలాపాలకు వేదికగా ఉండకుండా ఢిల్లీ పోలీసులు ‘డీనోటిఫికేషన్’ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అన్నా హజారే నిరసనలతో 1990వ దశకం ప్రారంభంలో గుర్తింపు పొందిన జంతర్ మంతర్ ఇటీవలి కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నిరసనలను అదుపు చేయలేకపోయిన పోలీసులు లీగల్ కోణం నుంచి ఆలోచించి జంతర్ మంతర్‌ను నిరసనలకు వేదిక కాదంటూ డీనోటిఫై చేసి ప్రత్యామ్నాయంగా మరో మూడు స్థలాలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.
Kalam 360 : నిరసనలకు కేరాఫ్ అడ్రస్ జంతర్ మంతర్
Also Read : 20 కోట్ల ఓట్ల తొలగింపే బీజేపీ లక్ష్యం: సీఎం రేవంత్
Follow Us On: Youtube

