కలం, వెబ్ డెస్క్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ఢిల్లీని ఏకంగా ఒక జైలుగా, పోలీసుల కోటగా మార్చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
నిరసనల్లో పాల్గొనడానికి ప్రజలు ఢిల్లీకి రాకుండా బస్సులు, రైళ్లను నిలిపివేసి అడ్డుకుంటున్నారని, వీధుల్లో 20 వేల నుంచి 30 వేల మంది పోలీసులను మోహరించారని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమతో నిరంతరం టచ్లో ఉంటూ సమాచారం అందిస్తున్నారని సంచలన విషయాన్ని వెల్లడించారు.
ధర్మం, సత్యం, మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం తాము పోరాడుతున్నామని, ఓట్ చోరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో నెలలు, సంవత్సరాలైనా వెనక్కి తగ్గేదే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అసలు చరిత్రను త్వరలోనే దేశం ముందుకు తెస్తామని హెచ్చరించారు. ఎన్నికల వ్యవస్థలో జరిగిన అక్రమాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ, తమ విజప్తిని నేరుగా స్వీకరించని సీజేఐ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారని, అందుకే త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని, అలాగే యువత భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎంతమంది పోలీసులను పెట్టి అడ్డుకుంటే, వారు అంతగా తమ వ్యూహంలో చిక్కుకుంటారని, ప్రభుత్వ అణచివేత చర్యల వెనుక ఉన్న అసలు నిజాలను దేశ ప్రజలందరికీ తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : 20 కోట్ల ఓట్ల తొలగింపే బీజేపీ లక్ష్యం: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

