చిట్యాల పోలీస్ స్టేషన్‌లో యాదాద్రి జోన్ ఐజీ ఆకస్మిక తనిఖీ

కలం, నల్లగొండ: యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం (Shahnawaz Qasim) సోమవారం నల్లగొండ జిల్లాలోని చిట్యాల పోలీస్ స్టేషన్‌ను (Chityal Police Station) ఆకస్మికంగా సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న విధులు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఐజీ షాహనవాజ్ ఖాసిం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలకు చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. చిట్యాల పరిధిలోని జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, హెల్మెట్ సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, పోక్సో కేసుల్లో బాధితుల గోప్యత పాటిస్తూ నాణ్యమైన, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. దొంగతనాలు, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, సీసీ కెమెరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కోర్టుల్లో సమర్థవంతంగా సాక్ష్యాధారాలు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అలాగే ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సైబర్ బాధితులు తక్షణమే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఐజీ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పెంచి, రోడ్డు ప్రమాదాల నివారణకు, మహిళల భద్రతకు, నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్.ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>