కలం, వెబ్డెస్క్: సర్ ప్రక్రియను ఓటు హక్కు కల్పించేందుకు చేయాలి కానీ, ఇప్పుడు ఓటు హక్కు తొలగించేందుకు చేస్తున్నారని, సర్ పూర్తిగా దారి తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సర్ ప్రక్రియ మొదట్లో మంచి ఉద్దేశంతోనే ప్రారంభమైందన్నారు. కానీ, బీజేపీ కుట్రలతో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ను ముగ్గురు సభ్యులు ఎన్నుకుంటారని సీఎం రేవంత్ చెప్పారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ కలిసి సీఈసీ(CEC)ని ఎంపిక చేయాలని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం 2023లో ఆ నిబంధనలు పూర్తిగా మార్చేసిందని విమర్శించారు. ప్రధాని, హోం మినిస్టర్, ప్రతిపక్ష నేతలకు ఎంపిక బాధ్యత ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ అప్పట్లోనే సీఈసీగా జ్ఞానేష్ కుమార్ వద్దని చెప్పారని గుర్తు చేశారు.
దేశంలోని అన్ని స్వయం ప్రతిపత్తి గల సంస్థలను బీజేపీ తన స్వలాభానికి వాడుకుంటున్నదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ను వాడుకొని ఓట్ చోరీకి తెర లేపిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని పౌరులను రెండు వర్గాలుగా విభజించే కుట్ర జరుగుతోందని రేవంత్ అన్నారు. సంపన్నులు, బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్లు ఒక వర్గం, గిరిజనులు , పేదలు సహా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్లను ఒక వర్గంగా చేస్తున్నారని ఆరోపించారు.
మొత్తంగా 20 కోట్ల ఓట్ల తొలగింపే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందన్నారు. 20 శాతం మందిని ఓటు హక్కు లేని వారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది దేశ భద్రత, మనుగడకు సంబంధించిన అంశమని, రాహుల్ గాంధీ దేశంలో మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read : నల్లగొండలో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయ వివాదం
Follow Us On: X(Twitter)

