కలం డెస్క్ : రాష్ట్రంలోని సాగునీటి అంశాలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో (Water Debate) బీఆర్ఎస్ పాల్గొనకపోవడం ఆ పార్టీకి ఒక చారిత్రక తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్‌ను దోషిగా చూపిన కేసీఆర్ చివరకు గైర్హాజరు కావడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనన్న మాటలూ వినిపిస్తున్నాయి. రెండేండ్లు మౌనంగా ఉన్నా.. తప్పదు కాబట్టే బైటకు వచ్చా.. రాష్ట్ర నీటి హక్కులను కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం.. సర్వభ్రష్ట కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.. ఇప్పటివరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. నేనే వస్తున్నా.. తోలు తీస్తా.. ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా.. అంటూ గత నెల తెలంగాణ భవన్లో ఆవేశపూరితంగా మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు పెడతామని స్వయంగా తానే రంగంలోకి దిగుతానని ప్రకటించారు.
తోలు తీస్తానంటూనే తోక ముడిచారా? :
రాష్ట్రంలో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉన్నదని, ప్రజలతో కలిసి సాగునీటి హక్కుల కోసం కోట్లాడతామని కేసీఆర్ ప్రకటించి తోలు తీస్తామంటూ హెచ్చరించారు. రెండేండ్ల పాటు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్ వీరావేశంతో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరగడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ మొదలైందనే చర్చ జోరుగా సాగింది. అసెంబ్లీ వేదికగానే చర్చలకు (Water Debate) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి రోజున కేసీఆర్ అటెండ్ అయ్యారు. చర్చలో స్వయంగా ఆయనే పాల్గొంటారని అందరూ ఆశించారు. ప్రభుత్వ బండారాన్ని, నిర్లక్ష్యాన్ని, చేతకానితనాన్ని ఎక్స్ పోజ్ చేస్తారనే మాటలు వినిపించాయి. కానీ తోలు తీస్తా.. అని కామెంట్ చేసిన కేసీఆర్ హాజరుకాకుండా తోక ముడిచారన్న విమర్శను మూటగట్టుకున్నారు.
సీఎం రేవంత్ సవాల్‌తో పలాయనం :
మీడియా సమావేశాలు, పార్టీ ఆఫీసులు, జిల్లాల్లో బహిరంగసభల్లో కాకుండా అసెంబ్లీ వేదికగానే చర్చిద్దామంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అదే రోజున సవాలు విసిరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సభకు రావాలని, ఆయన గౌరవానికి భంగం కలగకుండా తాను చూసుకుంటానని, అర్థవంతమైన చర్చతో వాస్తవాలు ప్రజలకు తెలియాలని, ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. చేతికాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం… తొమ్మిదిన్నరేండ్లలో కృష్ణా జలాల్లో కేసీఆర్ (KCR) చేసిన ద్రోహాన్ని లోతుగా అధ్యయనం చేసింది. కానీ తోలు తీస్తా.. అంటూ గంభీర ప్రకటననలు చేసిన బీఆర్ఎస్ పలాయనం చిత్తగించడం ఆ పార్టీకి మైనస్ అయింది.
తెలంగాణ నీటి హక్కుల ద్రోహులెవరు? :
తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టిన ఉద్యమ నాయకుడు అంటూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను పదేపదే కీర్తించారు. బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణకు, ప్రజలకు అన్యాయం జరగనివ్వ, ప్రజలతో కలిసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతానంటూ కేసీఆర్ ఇటీవల మీడియా కాన్ఫరెన్సులో కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను హరిస్తున్నదని, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నదన్నారు. కానీ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ నిర్ణయాలతో జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా బైటపెట్టింది. కేసీఆర్ చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉన్నదో, అది శాశ్వత ప్రమాదకారిగా ఎలా మారిందో వివరించింది. దిద్దుబాటు చర్యలపైనా సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. రోజంతా అసెంబ్లీలో జరిగిన చర్చతో తెలంగాణ పాలిట ద్రోహులెవరో ప్రజలకు అవగతమైంది.
Read Also: హరీశ్‌రావు గొంతు నొక్కిన కేసీఆర్ !
Follow Us On: X(Twitter)


