epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హరీశ్‌రావు గొంతు నొక్కిన కేసీఆర్ !

కలం డెస్క్ : హరీశ్‌రావు (Harish Rao) గొంతు నొక్కింది అసెంబ్లీ స్పీకరా?.. లేక కేసీఆరా?.. హరీశ్‌రావు గొంతు విప్పితే బీఆర్ఎస్ పార్టీకి లాభమా?.. నష్టమా?.. చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేయడానికి కారణమేంటి?.. హరీశ్‌రావు తీసుకున్న సొంత నిర్ణయమా?.. లేక అధినేత కేసీఆర్ నుంచి వచ్చిన ఆదేశమా?.. ఇవీ ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చ. సెషన్‌కు హాజరుకాకుండా బహిష్కరించాలన్న నిర్ణయం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి నెగెటివ్‌గా మారింది. ఈ సమయంలోనే ఈ నిర్ణయం పక్కాగా కేసీఆర్ (KCR) నుంచి వచ్చిన ఆదేశం మేరకే హరీశ్‌రావు ప్రకటించారనేది లాబీల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు బీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. పక్కా ప్లాన్‌తోనే సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి మాటల ద్వారా స్పష్టమవుతున్నది.

కేటీఆర్‌ భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడకుండా.. :

కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు అసెంబ్లీలో జరిగే జల చర్చలో హరీశ్‌రావు (Harish Rao) గంటలకొద్దీ మాట్లాడితే ఆయన పాపులారిటీ పెరుగుతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. కేటీఆర్‌ (KTR) రాజకీయ భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమవుతుందని, కేడర్‌లో ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ పక్కా ప్రణాళికతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సెషన్‌లో ఒక రోజు లేదా రెండు రోజుల చర్చే అయినా హరీశ్‌రావు వాగ్ధాటి, లేవనెత్తే అంశాలు ఆయనను హీరోగా నిలబెడతాయని, దాని ప్రభావం రానున్న రోజుల్లో ఆయన పాపులారిటీ పెరిగి బలమైన రాజకీయ నాయకుడిగా మారుతారని, ఇది పార్టీలో రకరకాల చర్చలకు దారితీస్తుందని, దీన్ని నివారించడానికే సెషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నది ఆ గుసగుసల సారాంశం.

దోషిగా నిలబడక తప్పదనే భావన కూడా.. :

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువ అంటూ ఇప్పటికే కాంగ్రెస్ బలంగా వాదిస్తున్నది. వివిధ సందర్భాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అనేక ఆధారాలను బహిర్గతం చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంతకాలు తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేశాయన్నారు. ఆ ఒక్క సంతకమే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారిందని సీఎం రేవంత్ సైతం వ్యాఖ్యానించారు. ఈ ఆధారాలన్నింటినీ సభలో సభ్యులకు అందజేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని మధ్యేమార్గంగా సభలో లేకపోవడమే మంచిదనే ఉద్దేశంతో బహిష్కరణ అస్త్రాన్ని ఎంచుకున్నారన్న మాటలు లాబీల్లో వినిపించాయి. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు దోషిగా నిలబడాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఒకటనే కామెంట్లు వచ్చాయి.

డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినా… :

హరీశ్‌రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ బాధ్యతలు అప్పజెప్పడంపైనా ఆ పార్టీలో చర్చకు దారితీసింది. కేసీఆర్ గైర్హాజరవుతున్న సందర్భంలో హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశిస్తూ తరచూ సీఎం రేవంత్ ఏ హోదాలో మాట్లాడుతున్నారంటూ నిలదీస్తున్నారు. ఇక నుంచి ఆ కామెంట్లు రాకుండా ఉండేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు హరీశ్‌రావుకు అడ్వాంటేజ్‌గా మారింది. ఆ రకంగా హరీశ్‌రావును కేసీఆర్ సంతృప్తిపర్చినా చివరకు జలచర్చలో అవకాశం లేకుండా చేసి వెనక్కి లాగారన్నది మరో వాదన. అసెంబ్లీ వేదికగా దోషిగా నిలబడడం, హరీశ్‌రావు హైలైట్ అయితే కేటీఆర్ డైల్యూట్ కావడం.. వీటిని బేరీజు వేసుకునే కేసీఆర్ వ్యూహాత్మకంగా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నది లాబీల్లోని చర్చల్లో కీలకాంశం.

Read Also: దేవుడి మీద ఆన.. బతికున్నంతకాలం భంగం రానివ్వ : సీఎం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>