కలం, వరంగల్ బ్యూరో : పూజలు చేస్తే డబ్బులు మూడు రెట్లు అవుతాయని అధికార పార్టీ లీడర్ ను నమ్మించిన మోసగాళ్లు రూ.55 లక్షలతో ఉడాయించిన ఘటన హనుమకొండ (Hanumakonda) జిల్లా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలానికి చెందిన యువకుడు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణిస్తున్నాడు. కాగా గత నెల 25న తన స్వగ్రామం ఉనికిచర్లలో ఉన్న గెస్ట్ హౌస్ అద్దెకు కావాలని స్నేహితుడైన రవి అడిగాడు. మొదట అంగీకరించని సదరు బాధితుడు తర్వాత సరేనన్నాడు.
రవి డిసెంబర్ 30న జనగామ జిల్లాకు చెందిన ప్రసాద్, కుమార్ తో పాటు ఇద్దరు పూజారులను వెంటబెట్టుకుని గెస్ట్ హౌస్ వద్దకు వచ్చాడు. వారికి గెస్ట్ హౌస్ తాళాలు ఇచ్చిన బాధితుడు మీరు ఏం చేస్తారని అడగడంతో డబ్బులు డబుల్, త్రిబుల్ అయ్యే పూజలు చేస్తామని నమ్మించారు. అంతేగాకుండా నువ్వు కూడా పూజ చేసుకుంటే డబ్బులు మూడింతలు అవుతాయని భాధితుడిని ప్రోత్సహించారు. వారి మాటలు నిజమని నమ్మిన భాధితుడు పూజ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని తన తండ్రి, సోదరులకు వివరించాడు. అప్పటికప్పుడు తన భూమిని విక్రయించి రూ.33 లక్షలు, ఇంట్లో ఉన్న బంగారం కుదువ పెట్టి రూ.22 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.
బాధితుడి కుటుంబ సభ్యుల సమక్షంలో గత నెల 31న సదరు పూజారులు హనుమకొండ (Hanumakonda) జిల్లా ఉనికిచర్లలోని గెస్ట్ హౌస్ లో పూజలు నిర్వహించారు. పూజలో డబ్బులు పెట్టి చేస్తే త్రిబుల్ అవుతాయని తండ్రీ కొడుకులను నమ్మించారు. తర్వాత వారిని ఒక గదిలో పెట్టి తాళం పెట్టారు. పూజ పూర్తయిన తర్వాత గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో ఉన్న బ్యాగ్ ను పరిశీలిస్తే రూ.2 కోట్లు ఉంటాయని నమ్మించి రూ.55 లక్షలతో ఉడాయించారు. తర్వాత మోసాన్ని గ్రహించిన బాధితులు స్థానిక పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ‘ఏఐ’తో రోడ్డు ప్రమాదాలకు చెక్ : ఖమ్మం కలెక్టర్
Follow Us On: X(Twitter)


