కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి (Nakkapalli Accident) జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం జంక్షన్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన నూకరాజు, సూర్యకుమార్లుగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఆసుపత్రి మలుపు వద్ద ఓ బైక్ తిరుగుతుండగా, అడ్డరోడ్డు వైపు నుంచి వేగంగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పి. రామకృష్ణ, నాగేశ్వరరావులను స్థానికులు 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సారిపల్లిపాలెంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

