కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar)కు 42 మంది మాజీ జడ్జిలు మద్దతు తెలుపుతూ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఈ తరహా దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విమర్శించే హక్కు ఉంటుందని.. తాము కూడా న్యాయ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎన్నో విమర్శలకు గురైనవారమేనని వెల్లడించారు.
అయితే ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న దాడి మాత్రం ఆందోళనకరమన్నారు. రాజకీయ స్వలాభం కోసం, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ.. వ్యవస్థను బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజ్యాంగాని అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులను దొంగలు, పాలకులు చెప్పినట్లు ఆడేవారు.. అన్నంత నీచంగా చిత్రీకరించడం ఏమాత్రం సరికాదన్నారు.
ఎన్నికల తరువాతే ఎందుకు..?
‘ఓటు చోరీ’ అంటూ చేస్తున్న ఆరోపణలు కేవలం మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నాయని.. ఇంతవరకు కోర్టుల్లో ఎక్కడా విచారణ జరిగిన సందర్భం లేదని మాజీ జడ్జిలు ఆరోపించారు. ఇలాంటి అంశాలపై నిజనిజాలు కేవలం కోర్టుల్లోనే తేలుతాయి తప్ప.. అదే పనిగా దాడి చేయడం సరికాదన్నారు. ఎన్నికల సంఘంపై ఎలాంటి అనుమానం ఉన్నా.. పరిష్కారం కోసం న్యాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల ముందు వరకు ఈవీఎంలు బెటర్ అని, ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమికి ఈవీఎంలదే బాధ్యత అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈసీపై అభండాలు మోపడం కంటే ఆధారాలతో కమిషన్, కోర్టులను సంప్రదించవచ్చన్నారు.
Also Read : ఓట్ల చోరీకి ఆ నలుగురిదే బాధ్యత: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

