కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రతిపాదిత హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్ (హైస్పీడ్ రైల్) (Hyderabad-Bengaluru Bullet Train) కారిడార్, దానికి సంబంధించిన సబ్ స్టేషన్/ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ప్రాథమిక స్థల పరిశీలన, సర్వే ప్రక్రియ సాగుతోంది.
అందులో భాగంగా గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తోపాటు అచ్చంపేట డివిజన్ సబ్ కలెక్టర్/RDOతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్ (శంషాబాద్) నుంచి ప్రారంభమై ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, శ్రీశైలం మీదుగా బెంగళూరుకు ఈ బుల్లెట్ రైలు మార్గం ప్రతిపాదించబడిందని వివరించారు.
అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద నుంచే దాదాపు 54.9 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్/రైల్ కారిడార్ ప్రారంభమై శ్రీశైలం పాతాళగంగ వరకు వెళుతుందని డీపీఆర్ తయారుచేసినట్లు అధికారులతో చర్చించారు. పర్యావరణ రక్షణ నల్లమల అటవీ ప్రాంతం, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ మార్గంలో ప్రత్యేక ఎలివేటెడ్ వయాడక్ట్‌లు ఏర్పాటుతో పాటు ముఖ్యంగా అతి త్వరలోనే కృష్ణానదిపై ప్రత్యేక సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు , ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

