కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి సమీపంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ (Driver Srinivas), తనకు గుండెపోటు వస్తున్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి, బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు నిలిపివేశారు. దీనితో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
బస్సును నిలిపిన అనంతరం స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. డ్రైవర్ శ్రీనివాస్ చివరి క్షణంలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం పట్ల పలువురు ప్రశంసిస్తూ, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

