కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఇందిరా గాంధీ కుటుంబమే దేశాన్ని పరిపాలించాలని ఈర్షతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ(PM Modi)పై ఆరోపణలు చేస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా పాలమూరులో నిర్వహించిన సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలలలో భాగంగా సేవ జ్యోతి యాత్ర నిర్వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలసి ఎంపీ డీకే అరుణ వీక్షించారు.
సేవ జ్యోతి యాత్ర(Seva Jyoti Yatra)లో కాగడాలతో ఎంపీ డీకే అరుణ (DK Aruna) అంబేద్కర్ కళాభవన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలచే ఎన్నుకోబడి, అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా నరేంద్ర మోదీ సేవలందిస్తున్నారని ఆమె తెలిపారు. దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. దేశ మార్పునకు విశేషంగా మోదీ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి పెంచారని, ఉగ్రదేశాల కుట్రలను, శత్రువుల దాడులను ఎదుర్కొని, గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
భారతదేశ ప్రజలు మళ్లీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని, ప్రజలు గెలిపిస్తున్నారని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీని ఢీకొనేవారు ఎవరూ లేరన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న మోదీ సంకల్పంలో దేశ ప్రజలందరు భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
దేశ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భగవంతుడు దీర్ఘాయుష్షును, శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కునే శక్తిని, ప్రసాదించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారి కుటుంబం తప్ప ఎవరు దేశాన్ని పాలించవద్దని ఈర్షతోనే కేంద్ర ప్రభుత్వంపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ పాలన చూసి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజయ్య, సుదర్శన్, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు రమేష్, సంతోష్, జ్యోతి, పాండు రంగారెడ్డి,సాహితీ రెడ్డి, శ్రీనాథ్, మండల ముఖ్య నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : బాలురపై లైంగిక వేధింపులు.. 9 నెలల్లో 62 పోక్సో కేసులు
Follow Us On: Youtube

