రీల్స్ అతిగా చూస్తున్నారా?.. లేటెస్ట్ స్టడీలో షాకింగ్ విషయాలు

కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. గ్లోబల్ డిజిటల్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ డేటారిపోర్టల్ 2026 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 566 కోట్లకు చేరుకుంది. ఒక్కో యూజర్ వారానికి సగటున 18 గంటల 36 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు వెల్లడించింది. అంటే రోజుకు సుమారు 2 గంటల 39 నిమిషాలు, ఏడాదికి దాదాపు 40 రోజులు లేదా 967 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారన్నమాట. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ (Reels Addiction) చూస్తూ సమయం తెలియకుండానే గంటలు గడిపేస్తున్న పరిస్థితి పెరుగుతోంది. ఐదు నిమిషాలు మాత్రమే రీల్స్ చూస్తానని యాప్‌ ఓపెన్ చేసి.. వరుసగా మరో రీల్, ఇంకో రీల్ అంటూ స్క్రోల్ చేస్తున్నారు. చివరకు అరగంట లేదా గంట గడిచిపోయిన విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు.

రీల్స్ మాయలో జెన్‌జీలు

భారత్‌లోనూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వినియోగం ఊహించనివిధంగా పెరిగింది. డేటారిపోర్టల్ ప్రకారం 2025 నాటికి భారత్‌లో 48 కోట్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. మెటా-ఐపీఎస్‌ఓఎస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న జనరేషన్‌-జెడ్‌కు చెందిన 89 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ (Reels Addiction) చూస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో 85 శాతం మంది కూడా రోజూ రీల్స్ చూస్తున్నట్లు సర్వే తెలిపింది. దేశంలోని 23 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4,000 మందికి పైగా నిర్వహించిన ఈ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. భారతీయులు సోషల్ మీడియా యాప్‌లపై రోజుకు సగటున 3.2 గంటలు గడుపుతున్నారు. అయితే అవసరమైన పనుల కంటే రీల్స్‌కే ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు అయితే, దానిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ శౌనక్ అజింక్యా సూచిస్తున్నారు.

కొత్త కంటెంట్‌ను చూపిస్తూ, సమయాన్ని తినేస్తూ

ఈ రీల్స్ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఆసక్తులకు అనుగుణంగా కంటెంట్‌ను చూపిస్తుంది. దీంతో యూజర్‌కు నచ్చే కంటెంట్ పదేపదే ముందుకు వస్తుంది. ప్రతి కొత్త రీల్‌లో ఏదో కొత్తదనం ఉండటంతో చాలామంది తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు. ఈ కారణంగా తర్వాతి రీల్‌ను చూడాలనే ఆసక్తిని పెంచుతుంది. లైక్స్, కామెంట్లు, షేర్లు, నోటిఫికేషన్లు కూడా యాప్‌ను పదేపదే తెరిచే అలవాటును పెంచుతాయి. తక్కువ సమయంలో కొత్త కొత్త కంటెంట్‌ను చూసేలా ప్రభావం చూపుతుండటంతో తెలియకుండా సమయం వేస్ట్ అవుతోంది. అలాగే తక్షణ సంతృప్తికి మెదడు అలవాటు పడే అవకాశం ఉంది. ఫలితంగా ఒకే పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టమవడం, తరచూ ఫోన్ చెక్ చేయాలనే కోరిక కలగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ప్రధాన నష్టాలివే..

  1. రీల్స్ అతిగా చూడటం వల్ల రోజువారీ జీవితంపై ప్రభావం
  2. పని, చదువు, నిద్రను దూరం చేయడం
  3. తెలియకుండానే సమయాన్ని వృథా చేయడం
  4. ముఖ్యంగా షార్ట్ వీడియోలకు మెదడు అలవాటు పడి ఏకాగ్రత దెబ్బతినడం
  5. అనేక అనారోగ్య సమస్యలకు కారణం
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>