కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు (India Womens Cricket Team) డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు (Dressing Room Rift) ఒక్కసారిగా భగ్గుమన్నాయి. స్టార్ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మధ్య సత్సంబంధాలు దెబ్బతిని జట్టులో చీలికకు దారితీశాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఒత్తిడికి కారణమయ్యాయని తెలుస్తోంది. గౌహతిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన రివ్యూ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. జట్టులో మార్పు అనివార్యమని బోర్డు స్పష్టం చేయడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
పది వేలకు పైగా పరుగులు చేసిన స్మృతికి కెప్టెన్సీ ఎప్పుడో దక్కాల్సిందని, సెలెక్టర్ల అలసత్వం వల్లే ఆలస్యమైందని గతంలో మిథాలీ రాజ్ విమర్శించారు. గతంలో మిథాలీ రాజ్ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనూ ఇలాంటి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి పునరావృతమైందన్న చర్చ జరుగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇకపై కేవలం బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నారు. గత విభేదాలను పక్కనబెట్టి జట్టు విజయమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్, స్మృతి కలిసి ముందుకు సాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

