వృద్ధి రేటు అంచనా పెంపు.. జోష్‌లో ఆర్థిక వ్యవస్థ

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వివిధ పరిణామాలతో భారత్ ప్రభావితమవుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటును 7.1 శాతం అంచనా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ (World Bank) మంగళవారం వెల్లడించింది. ‘ఇండియా డెవలప్‌మెంట్ అప్డేట్’ పేరిట విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది.

గత ఏప్రిల్ నెలలో ఈ వృద్ది రేటు అంచనా 6.6 శాతంగా ఉంటే.. ఈ సారి 0.5 శాతం మేర పెంచడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో బలమైన పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం కూడా స్థిరంగా కొనసాగడటంతో ఈ ఏడాది త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈసారి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

పారిశ్రామిక రంగమే చోదక శక్తి..

దేశ ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక రంగం చోదక శక్తిగా ఉందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ముందస్తు అంచనాలను మించి రాణిస్తోందని ప్రశంసించింది. తొలి త్రైమాసికంలో విద్యుత్ రంగం 9.3 శాతం, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలు 7.2 శాతం వృద్ధిని సాధించాయని వివరించింది. అదే సమయంలో ఎగుమతులు కూడా సముచిత స్థాయిలో ఉన్నట్లు తెలిపింది.

ఎల్ నినో కారణంగా ఆగస్ట్ వరకు వర్షపాతం అతి తక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా నమోదైందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల లోటు కారణంగా వ్యవసాయం రంగం వృద్ధి బలహీనంగా మారబోతుందని హెచ్చరించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రైవేట్ పెట్టుబడులపై కొంత ప్రభావం ఉంటుందని.. ఇది అంతిమంగా ప్రభుత్వ వ్యయంపై ప్రభావం చూపబోతుందని విశదీకరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>