కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (ఎఫ్ఓఎస్) పాముల సంచారాన్ని ముందుగానే అంచనా వేసే సరికొత్త వ్యవస్థను (Snake Movement Prediction) సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. పాములు కనిపించే అవకాశం ఉన్న ప్రాంతాలు, సమయాలపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి పాముకాటు ఘటనలను తగ్గించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందిస్తోంది.
మెషిన్ లెర్నింగ్ మోడల్‌తో అనుసంధానం..
2024, 2025లో తెలంగాణలో నమోదైన 35,234 పాము రక్షణ చర్యల రికార్డులను విశ్లేషించి, వాతావరణ పరిస్థితులు, సూర్యరశ్మి వివరాలను మెషిన్ లెర్నింగ్ మోడల్‌తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 72 ప్రాంతాలను కవర్ చేస్తోంది. వాతావరణ ఆధారంగా పాముల సంచారాన్ని అంచనా వేయడంలో ఈ మోడల్ 90 శాతం వరకు కచ్చితత్వం సాధించినట్లు ఎఫ్ఓఎస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ సి.విశ్వనాథన్ స్పష్టం చేశారు.
15 రోజుల ముందుగానే తెలిసేలా..!
శ్రీలంకలోని క్యాండీలో జరిగిన తొలి ప్రపంచ పాముల సదస్సులో ఎఫ్ఓఎస్ ఈ వాతావరణ ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్‌ను ప్రదర్శించింది. పాముల సంచారం పెరిగే సమయాల్లో ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, రక్షణ బృందాలు కూడా అవసరానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని విశ్వనాథన్ తెలిపారు. భవిష్యత్తులో 15 రోజుల ముందుగానే పాముల కదలికలను అంచనా వేసేలా మోడల్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వనాథ్ వెల్లడించారు.

