కలం, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు (Maoist leaders) లొంగిపోయారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సె దేవా, మావోయిస్టు పార్టీ సీనియర్ నేత కంకణాల రాజిరెడ్డి (Raji Reddy)తోపాటు మొత్తం దాదాపు 20 మంది మావోయిస్టులు (Maoist Cadres) లొంగిపోయారు. శనివారం మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో వీరంతా లొంగిపోయారు. వారి దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను పోలీసులు ప్రదర్శించారు.
చత్తీస్‌గఢ్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో సరిహద్దు గుండా తెలంగాణలోకి కొన్ని వారాల క్రితమే దేవా సహా ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మావోయిస్టు పార్టీ సభ్యులు వచ్చినట్లు రాష్ట్ర పోలీసులకు సమాచారం అందింది. ఆయుధాలతో సహా లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక లొంగిపోవడానికే వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దగ్గర నుంచి పోలీసులు 8 ఏకే-47, 8 ఎస్ఎల్ఆర్, 10 ఇన్సాస్ రైఫిళ్ళు, 2 ఎల్ఎంజీ రైఫిళ్ళు సహా మొత్తం 48 తుపాకులు, 2,206 రౌండ్ల తూటాలు, 93 మ్యాగజైన్లు, 20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
తెలంగాణలో ఈ రెండేండ్ల కాలంలో మొత్తం 516 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, 14 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 24 మంది డివిజన్ కమిటీ కార్యదర్శులు/సభ్యులు, 86 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, 450 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. ఈ లొంగుబాట్లతో మొత్తం 144 ఆయుధాలు పోలీసులకు చేరాయి. తెలంగాణకు చెందిన ఇంకా 17 మంది మావోయిస్టులు అజ్ఞాత జీవితంలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన సభ్యులు, కార్యదర్శులు లొంగిపోగా కేవలం బడే దామోదర్ మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు.
2023 నాటికి మావోయిస్టు పార్టీలో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణకు చెందినవారు కాగా 2026 జనవరి 3వ తేదీ నాటికి ఆ సంఖ్య నాలుగుకు తగ్గింది. రాష్ట్ర కమిటీ సభ్యులు 2023 నాటికి 24 మంది ఉంటే ఇప్పుడు కేవలం ఐదుగురే ఉన్నారు. డివిజనల్ కమిటీ కార్యదర్శులు/సభ్యులు 2023లో 36 మంది ఉంటే ఇప్పుడు ముగ్గురే మాత్రమే మిగిలారు. ఏరియా కమిటీ సభ్యులు, పార్టీ మెంబర్లతో కలిపి 2023 నాటికి మొత్తం 125 మంది ఉంటే ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు.

Read Also: అమెరికా అదుపులో వెనిజులా అధ్యక్షుడు : ట్రంప్
Follow Us On: Instagram


