కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందంటూ తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు శనివారం మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి.. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. ఐఎఫ్‌టీయూ నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. హోల్‌సేల్ మార్కెట్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య ఉందని చెబుతున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. మార్కెట్‌కు వాహనాలతో వస్తున్నవారు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య వస్తోందన్నారు.
దీంతో కూరగాయల లోడ్‌తో వెళుతున్న వాహనాలు పడిపోయిన సందర్భాలున్నాయని వాపోయారు. వెంటనే శాశ్వత పరిష్కారంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అశోక్, కార్యదర్శి ఇమ్రాన్, హమాలి యూనియన్ అధ్యక్షులు రాజు, మోహన్, రిక్షా పుల్లర్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రైస్ వకీల్, హమాలీ ఫెడరేషన్ నగర జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, గంగాధర్ ,చౌదరి, సోను. అప్సర్, అయూప్, ఫారుక్ పాల్గొన్నారు..

